వ్యవసాయ బిల్లులపై పంజాబ్‌ రైతుల ఆగ్రహం

24 Sep, 2020 15:59 IST|Sakshi

మద్దతు ధర కొనసాగుతుందని సర్కార్‌ భరోసా!

అమృత్‌సర్‌ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం లభించిన నేపథ్యంలో పంజాబ్‌, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  ఈనెల 25న పంజాబ్‌ షట్‌డౌన్‌కు 31 రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ అమృత్‌సర్‌లో రైలు పట్టాలపై కూర్చుని రైల్‌ రోకో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. అమృత్‌సర్‌తో పాటు ఫిరోజ్‌పూర్‌లోనూ రైతులు రైల్‌ రోకోలో పాల్గొని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, బిల్లులకు అనుకూలంగా ఓటు వేసిన వారిని బాయ్‌కాట్‌ చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. బర్నాలా, సంగ్రూర్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ కార్యకర్తలు రైలు పట్టాలపై ఆందోళన చేపట్టారు.

ఇక రైతుల ఆందోళనతో ప్రత్యేక రైళ్లను రైల్వేలు రద్దు చేశాయి. మూడు రోజుల పాటు 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేలు ప్రకటించాయి. ప్రయాణీకుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో కనీస మద్దతు ధర వ్యవస్ధ కుప్పకూలుతుందని, బడా కార్పొరేట్‌ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తుందనే భయం పంజాబ్‌ రైతులను వెంటాడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి మేలు జరుగుతుందని, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. చదవండి : బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?!

మరిన్ని వార్తలు