నిరసనలు: వారి గోడు వినండి సారూ!

13 Dec, 2020 18:11 IST|Sakshi

రైతుల నిరసనల్లో తొమ్మిదేళ్ల బాలిక లిసిప్రియా

న్యూఢిల్లీ: లిసిప్రియా కంగుజం.. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు పర్యావరణ కార్యకర్తగా గుర్తింపు పొందిన తొమ్మిదేళ్ల బాలిక. ఢిల్లీలో పీల్చేందుకు గాలి కరువైందని ఇటీవల రాష్ట్రపతి కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఆమె తాజాగా రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. రైతులు లేనిదే తిండి లేదని, వారికి న్యాయం జరగనిదే విశ్రాంతి లేదని అన్నారు. వారి ఆక్రందనలను పట్టించుకోవాలని నరేంద్ర మోదీ సర్కారును విజ్ఞప్తి చేశారు. సంఘు బోర్డర్‌లో అన్నదాతలు చేస్తున్న నిరసనల్లో శనివారం రాత్రి ఆమె పాల్గొన్నారు. దాంతోపాటు రైతుల నిరసన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విటర్‌లో షేర్‌ చేసి.. తన గోడును ప్రపంచ దృష్టికి చేరుతుందని ఆకాక్షించారు. గత 14 రోజులుగా తమ తల్లిదండ్రులు, తాతా బామ్మలతోపాటు ఢిల్లీలో నిరసనల్లో పాల్గొంటున్న పిల్లలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
(చదవండి: ఇక మహా పోరాటమే)

ఇక పంజాబ్‌, హరియాణ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణానికి నష్టం కలుగుతోందని లిసిప్రియా ఆందోళన వ్యక్తం చేశారు. పంట వ్యర్థాలను కాల్చొద్దని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ కాలుష్యం విషయంలో రైతులను మాత్రమే నిందిచలేమని చెప్పారు. వాతావరణ మార్పులతో అన్నదాతమే మొట్టమొదటి బాధితులుగా మారుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనందరికీ కూడుపెట్టే రైతన్న చనిపోతే పట్టించుకునే నాథుడు లేడని, నీతి వ్యాఖ్యాలు వల్లించే రాజకీయ నాయకులు వారి శ్రేయస్సు కోసం పనిచేయాలని, రైతుల గోడు వినాలని హితవు పలికారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని లిసిప్రియా కేంద్రాన్ని అర్థించారు. పర్యావరణ పరిరక్షణతో రైతులకు, తద్వార సమస్త మానవాళికి ఎంతో మేలు జరగుతుందని అన్నారు. పారిస్‌ ఒప్పందనికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా వాతావరణ పరిరక్షణకు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు
(చదవండి: రాష్ట్రపతి భవన్‌ ముందు తొమ్మిదేళ్ల బాలిక నిరసన)

మరిన్ని వార్తలు