ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం.. రైతుల హెచ్చరిక

6 Jan, 2021 09:09 IST|Sakshi
ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్‌ వద్ద ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల తాత్కాలిక గుడారాలు  

డిమాండ్లపై వెనక్కు తగ్గం

ట్రాక్టర్‌ మార్చ్‌ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం కొనసాగుతోంది. వేలాదిగా రైతులు, ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులకు పైగా నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నెలకొన్న తీవ్ర చలి పరిస్థితులకు తోడు, అనూహ్య వర్షాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయినా, డిమాండ్ల సాధన విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వారంతా ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నారు. రైతులు, ప్రభుత్వం మధ్య గత ఏడు విడతలుగా జరిగిన చర్చల్లో పెద్దగా పురోగతి చోటు చేసుకోలేదు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ఇరు వర్గాలు తమ పట్టు వీడడం లేదు. ఆ రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు తేల్చి చెబుతుండగా, ఆ చట్టాల రద్దు కుదరదని స్పష్టమైన సంకేతాలిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా, ఆ చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చ జరిపితే, అవసరమైన సవరణలు చేస్తామని చెబుతోంది.

ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య 8వ విడత చర్చలు ఈ నెల 8న జరగనున్నాయి. 8వ తేదీన జరిగే చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు సోమవారం జరిగిన చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి, చర్చల్లో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర సింగ్‌ తోమర్‌ వ్యాఖ్యానించారు. వర్షాల నుంచి రక్షణ కోసం రైతులు తమ దీక్షాస్థలిలో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైతుల టెంట్లలో నీళ్లు నిలుస్తుండటంతో ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎత్తైన బెడ్స్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు, ఢిల్లీకి వెళ్తున్న రైతులపై హరియాణాలోని మాసాని బ్యారేజ్‌ వద్ద ఆదివారం పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

రేపు ట్రాక్టర్‌ మార్చ్‌ 
డిమాండ్ల సాధనలో భాగంగా నేడు(బుధవారం, జనవరి 6న) తలపెట్టిన ట్రాక్టర్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని రైతులు గురువారానికి వాయిదా వేసుకున్నారు. జనవరి 6న అననుకూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. జనవరి 26న ఢిల్లీకి చేపట్టిన ట్రాక్టర్‌ మార్చ్‌ని భారీ స్థాయిలో నిర్వహిస్తామని రైతు నేత జోగిందర్‌ తెలిపారు. హరియాణాలోని ప్రతీ గ్రామం నుంచి 10 ట్రాక్టర్లు వస్తాయన్నారు. 

ప్రధానిని కలిసిన పంజాబ్‌ బీజేపీ నేతలు 
పంజాబ్‌ బీజేపీ నాయకులు సుర్జిత్‌కుమార్‌ జ్యానీ, హర్జిత్‌ సింగ్‌ గ్రేవల్‌ మంగళవారం ప్రధాని మోదీని కలిశారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని సుర్జిత్‌ అన్నారు. ‘మోదీకి అన్నీ తెలుసు. పంజాబ్‌ గురించి ఇంకా ఎక్కువ తెలుసు. మా సమావేశంలో ఏం చర్చించామనేది చెప్పలేను. కానీ మంచే జరగబోతోంది’ అని గ్రేవల్‌ వ్యాఖ్యానించారు. ‘రైతు ప్రయోజనాల కోసం ఏదైనా చేయడానికి ప్రధాని మోదీ సిద్ధంగానే ఉంటారు. కానీ రైతుల ఉద్యమంలోకి మావోయిస్టులు చొరబడ్డారు. వారే సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారు’ అని జ్యానీ పేర్కొన్నారు. చట్టాల రద్దుపై రైతులు మొండిగా ఉండవద్దని, ప్రభుత్వంతో చర్చలకు ఒకరిద్దరు నేతలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు