జంతర్‌మంతర్‌ వద్ద రైతుల ధర్నాకు అనుమతి

22 Jul, 2021 08:10 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపడానికి రైతులకు అనుమతి లభించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడుల నెలలకు పైగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా... ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీ శివార్లలోని సింఘు నుంచి గరిష్టంగా 200 మంది రైతులు బస్సుల్లో పోలీసు ఎస్కార్ట్‌తో జంతర్‌మంతర్‌కు వెళ్లాలని, ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడ నిరసన తెలుపొచ్చని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే ఆగస్టు 13 దాకా సంయుక్త కిసాన్‌ మోర్చా (రైతు సంఘాల ఉమ్మడి వేదిక) అనుమతి కోరగా.. జులై 22(గురువారం) నుంచి ఆగస్టు 9 వరకు ఎల్‌జీ అనుమతి మంజూరు చేశారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తామని, శాంతియుతంగా ధర్నా చేస్తామని కిసాన్‌ మోర్చా నుంచి రాతపూర్వక హామీని పోలీసులు కోరారు. ఈ ఏడాది జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీలో హింస చోటుచేసుకున్న తర్వాత ఢిల్లీలో రైతుల నిరసనలకు అనుమతివ్వడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు