రైతుల ఆందోళన: ‘మీ భోజనం మాకొద్దు’

3 Dec, 2020 17:10 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం రైతులతో చర్చలు జరుపుతున్నప్పటికి.. అన్నదాతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర మంత్రుల బృందం రైతులతో భేటీ అయ్యింది. మధ్యాహ్నం వరకు కూడా  చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని సమాచారం. ఇక భోజన విరామ సమయంలో రైతులు ప్రభుత్వం అందించే ఆహారాన్ని నిరాకరించారు. తామే వండుకుని తెచ్చుకున్న భోజనాన్ని స్వీకరించారు. సమావేశం జరుగుతున్న విజ్ఞాన్‌ భవన్‌ లోపలి విజవల్స్‌ ప్రకారం రైతులంతా పొడవైన డైనింగ్‌ టేబుల్‌ దగ్గర తమతో పాటు తెచ్చుకున్న భోజనాన్ని తింటుండగా.. మరి కొందరు కింద కూర్చుని తిన్నారు.

ఈ సందర్భంగా ఓ రైతు సంఘం నాయకుడు మాట్లాడుతూ.. ‘వారు మాకు భోజనం, టీ, కాఫీలు ఇవ్వాలని చూశారు. కానీ మేం వాటిని తిరస్కరించాం’ అని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీలో సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఇక నేటి భేటీలో మొదట వారు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు. (వైరలైన రైతు ఫొటో: అసలు నిజం ఇదే!)

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల గురించి చర్చిండానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిస్తున్నారు. నూతన చట్టాల పట్ల ప్రభుత్వం కూడా స్థిరంగానే ఉంది. రైతుల నిరసనల నేపథ్యంలో వారిని శాంతింపచేయడానికి సహాయపడే ఇతర అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తో‍న్న కనీస మద్దతు ధరకు సంబంధించి ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా