షరతులతో చర్చలకు ఒప్పుకోం

30 Nov, 2020 06:08 IST|Sakshi
సింఘు వద్ద రైతులను అడ్డుకుంటున్న పోలీసులు

కేంద్రానికి రైతు సంఘాల స్పష్టీకరణ

న్యూఢిల్లీ: షరతులతో కూడిన చర్చలకు సిద్ధంగా లేమని రైతులు కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే అన్ని మార్గాలను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రహదారులపై నిరసన విరమించి, బురాడీ గ్రౌండ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ సూచనపై ఆదివారం రైతులు పైవిధంగా స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా రైతులు ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టలు రైతులకు కొత్త హక్కులను, కొత్త అవకాశాలని అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో పునరుద్ఘాటించారు.

రైతుల సమస్యలు త్వరలోనే అంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. రైతులు తాము చెప్పిన  బురాడీ గ్రౌండ్‌కు తరలితే.. వారితో ఉన్నతస్థాయి మంత్రుల బృందం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ షరతుపై దాదాపు 30 రైతు సంఘాలు చర్చించి, షరతులతో కూడిన చర్చలకు వ్యతిరేకమని స్పష్టం చేశాయి.  బురాడీ గ్రౌండ్‌ను ఓపెన్‌ జైలుగా అభివర్ణించాయి. ‘హోంమంత్రి పెట్టిన షరతుకు మేం అంగీకరించబోం. షరతులతో చర్చలకు మేం సిద్ధంగా లేం. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. మా నిరసన, రహదారుల దిగ్బంధం కొనసాగుతుంది. ఢిల్లీలోకి ప్రవేశానికి వీలు కల్పించే ఐదు మార్గాలకు కూడా మూసేస్తాం’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ పంజాబ్‌ శాఖ అధ్యక్షుడు సుర్జీత్‌ ఎస్‌ ఫుల్‌ స్పష్టం చేశారు.

చర్చలు జరిపేందుకు షరతులు పెట్టడం రైతులను అవమానించడమేనన్నారు. పంజాబ్, హరియాణాల నుంచి మరింత మంది రైతులు త్వరలో తమతో చేరనున్నారని వెల్లడించారు. రైతులతో చర్చలు జరపాలని విపక్ష పార్టీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. కోవిడ్‌–19 ముప్పు, పెరుగుతున్న చలి కారణాలుగా చూపుతూ రైతులు వెంటనే  బురాడీ గ్రౌండ్‌కు తరలివెళ్లాలని, అలా వెళ్లిన మర్నాడే ఉన్నతాస్థాయి మంత్రుల బృందం వారితో చర్చలు జరుపుతుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా శనివారం నిరసనల్లో పాల్గొంటున్న 32 రైతు సంఘాలను ఉద్దేశించి ఒక లేఖ పంపించారు. కాగా, హరియాణాలోని పలు కుల సంఘాలు రైతుల నిరసనకు మద్దతు ప్రకటించాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో ముఖ్యంగా..సింఘు, టిక్రి ప్రాంతాల్లో రైతులు చలిని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. వారికి ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆహారం అందజేస్తోంది.  రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. రైతులు హరియాణా నుంచి ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా హరియాణా సీఎం ఖట్టర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నిరసన తో కరోనా విజృంభిస్తే ఆ బాధ్యత అమరీందర్‌దేనని ఖట్టర్‌ పేర్కొన్నారు. రైతుల ఆందోళనకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మద్దతు తెలిపారు.

మంత్రులు చర్చలు: రైతుల నిరసనలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, వ్యవసాయ మంత్రి తోమర్‌ చర్చిం చారు.

మరిన్ని వార్తలు