ఇదీ మా ఎజెండా

30 Dec, 2020 05:54 IST|Sakshi
ఢిల్లీ సమీపంలోని సింఘూ సరిహద్దులో హరిత విప్లవానికి ప్రతీకగా గ్రీన్‌ జిలేబీలను సిద్ధం చేసిన రైతులు

మరోసారి ప్రభుత్వానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు

సాగు చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత..

నేడు ప్రభుత్వం, రైతు సంఘాల  చర్చలు  

న్యూఢిల్లీ: చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు విధి విధానాలను రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతో పాటు గతంలో జరిగిన చర్చల సందర్భంగా తాము లేవనెత్తిన మరో రెండు డిమాండ్లపై మాత్రమే చర్చ జరగాలని తేల్చి చెప్పారు.

వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఆరో విడత చర్చలకు బుధవారం రావాలని ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. సాగు చట్టాల రద్దు కార్యాచరణ, ఎమ్మెస్పీకి చట్టబద్ధతతో పాటు దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్‌లో సవరణల అంశాన్ని కూడా చర్చించాలని 40 రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టం చేసింది.

అమిత్‌ షాతో మంతనాలు
నేడు రైతు నేతలతో చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు  నరేంద్ర సింగ్‌ తోమర్, గోయల్‌ హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తరఫున రైతులతో వ్యవసాయ మంత్రి తోమర్, రైల్వే  మంత్రి గోయల్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

కొనసాగుతున్న టవర్ల ధ్వంసం
రైతులు, రైతు మద్దతుదారులు పంజాబ్‌ రాష్ట్రంలో భారీ స్థాయిలో టెలికం టవర్లను ధ్వంసం చేయడాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌ జియో టెలికం సంస్థకు చెందిన టవర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపేయడం, టవర్లకు చెందిన కేబుల్స్‌ను కత్తిరించడం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ అని రైతులు భావిస్తున్నారు. పంజాబ్‌లో మంగళవారం దాదాపు 63 టవర్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు.  

గ్రీన్‌ రెవెల్యూషన్‌ @ జిలేబీ
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో రైతులు ఆకుపచ్చ జిలేబీలను వడ్డించారు. హరిత విప్లవానికి సంకేతంగా ఆకుపచ్చ జిలేబీలను తయారుచేసినట్లు నిరసనలో పాల్గొన్న బల్‌దేవ్‌ సింగ్‌ (65) అనే రైతు చెప్పారు. కాగా, పంజాబ్‌లో రోజుకు దాదాపు అయిదు క్వింటాళ్ల ఆకుపచ్చ జిలేబీ పంచుతున్నామని జస్విర్‌ చంద్‌ అనే రైతు తెలిపారు. ఇదిలా ఉండగా హరియాణాలోని కర్నాల్‌లో నిరసన జరుగుతున్న ఓ ప్రాంతంలో నిరసనకారుడు పెళ్లి కుమారుడిలా తయారై ట్రాక్టర్‌పై ఊరేగుతూ విభిన్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు