26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ

8 Jan, 2021 04:44 IST|Sakshi
ఢిల్లీ శివారులో ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొన్న రైతులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా రైతులు అడుగు ముందుకేస్తున్నారు. 26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ సన్నాహకాల్లో (రిహార్సల్‌) భాగంగా గురువారం ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్లతోపాటు హరియాణాలోని రేవసాన్‌ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. 26వ తేదీన హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఎనిమిదో దఫా చర్చలు శుక్రవారం జరగనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు తప్ప రైతుల నుంచి వచ్చే ఏ ఇతర ప్రతిపాదనైనా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ గురువారం పునరుద్ఘాటించారు. రైతులు, ప్రభుత్వం మధ్య శుక్రవారం చర్చల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

మరిన్ని వార్తలు