వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనకంజ

20 Jan, 2021 20:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ నెలలుగా రైతులు చలిని, ఎండను లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి కేంద్ర మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలోనే రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకు 9సార్లు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్రం మరోసారి నేడు 10వ సారి చర్చలు జరిపింది. నేటి చర్చల్లో కేం‍ద్రం రైతులకు ఓ ఆఫర్‌ను ప్రకటించింది. వివాదాస్పదంగా మారిన చట్టాలను ఒకటి లేదా రెండు సంవత్సరాలు పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు రైతుల సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి బుధవారం మీడియాకు వెల్లడించారు.

‘వ్యవసాయ చట్టాలను ఏడాది, ఏడాదిన్నర నిలుపుదల చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. తమ మాట మీద నమ్మకం లేకుండా సుప్రీంలో అండర్ టేకింగ్ ఇస్తామని చెప్పింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని చెప్పింది. కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు బోర్డర్ వద్ద సమావేశమై చర్చించుకుంటాం. ప్రభుత్వ ప్రతిపాదన రైతు ప్రయోజనాలు కాపాడేలా ఉందా లేదా అన్నది చర్చిస్తాం. తదుపరి నిర్ణయాన్ని ఈనెల 22న జరిగే భేటీలో కేంద్రానికి తెలియజేస్తాం. ఈ ప్రతిపాదనతో కేంద్రం దిగొచ్చినట్టే కనిపిస్తోంది’ అని కవిత తెలియజేశారు. అయితే మరోసారి జనవరి 22న రైతులతో కేంద్రం చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది.
 

>
మరిన్ని వార్తలు