కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాలు నో

22 Jan, 2021 02:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల అమలును 18నెలల పాటు నిలిపివేయడంతో పాటు చర్చల కోసం ఇరుపక్షాల నుంచి జాయింట్‌ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఆ ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కాదని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. గురువారం ఎస్‌కేఎం సర్వసభ్య సమావేశం జరిగిందని, ఇందులో కేంద్రం బుధవారం ప్రకటించిన ప్రతిపాదనను తిరస్కరించడం జరిగిందని ఎస్‌కేంఎం ప్రకటించింది.  చట్టాలు సంపూర్ణంగా ఉపసంహరించేవరకు వెనక్కు తగ్గమని తేల్చిచెప్పింది.   అయితే 41 యూనియన్లలో ఒకటైన భారతీయ కిసాన్‌ యూనియన్‌(సింధ్‌పూర్‌) నేత జగ్జిత్‌ సింగ్‌ దలేవాల్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. కేంద్రం ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.  కొందరు నేతలు ఇంకా చర్చిస్తూనే ఉన్నారన్నారు. కానీ మిగిలిన నేతల్లో ఎక్కువమంది ప్రతిపాదనలను తిరస్కరించామనే చెప్పారు.   కాగా, 26న జరపతలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని ఢిల్లీ వెలుపల నిర్వహించుకోవాలని పోలీసులు సూచించగా సాధ్యం కాదని తాము తిరస్కరించినట్లు స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ తెలిపారు.

రైతు సంఘాలతో సంప్రదింపులు షురూ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రైతు సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టింది. ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్న మహారాష్ట్ర షేట్కారీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ ఘన్వత్, వ్యవసాయ ఆర్థికవేత్తలు అశోక్‌ గులాటి, ప్రమోద్‌ కుమార్‌ జోషి గురువారం 8 రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిపినట్లు  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంప్రదింపుల ప్రక్రియలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పది రైతు సంఘాలు పాల్గొన్నాయని కమిటీ పేర్కొంది. పాల్గొన్న రైతు సంఘాల నాయకులు చట్టాల అమలు మెరుగుçకు సూచనలు కూడా ఇచ్చాయని తెలిపారు.

మరిన్ని వార్తలు