370 రద్దు వల్లే చైనా దురాక్రమణ

13 Oct, 2020 03:41 IST|Sakshi

ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు

దేశద్రోహ వ్యాఖ్యలు: బీజేపీ

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్‌లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్‌ అబ్దుల్లా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్‌ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం.

సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్‌ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్‌ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్‌ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్‌ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్‌ ఆమోదంతోనే ఆర్టికల్‌ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా తరచూ ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తుంటారని తెలిపారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు