వాహనదారులకు అలర్ట్‌.. జనవరి నుంచి ఇది మస్ట్‌

8 Nov, 2020 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్‌ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అన్ని రకాల ఫోర్‌ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రవాణా వాహనాలకు ఫాస్టాగ్‌ పునరుద్దరించిన తర్వాతే ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడం తప్పనిసరి అని చేసినట్లు తెలిపింది. కాబట్టి ఇకపై ప్రతి నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే.

టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్‌ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల ఫోర్‌ వీలర్లకు ఫాస్టాగ్‌ తప్పనిసరైంది.

మరిన్ని వార్తలు