‘‘ఈ ఎగిరే శవ పేటికలను రద్దు చేయండి’’

22 May, 2021 16:37 IST|Sakshi
పంజాబ్‌ మోగాలో కుప్పకూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ ప్రమాదంలో మరణించిన అభినవ్‌ చౌదరి(ఫైల్‌ ఫోటో)

పంజాబ్‌ మోగాలో కుప్పకూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌

మిగ్‌-21 ఫైటర్‌ జెట్లు రద్దు చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్న ఓ తండ్రి

న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలో మిగ్‌ ఫైటర్‌ జెట్లది ప్రత్యేక స్థానం. రెండేళ్ల క్రితం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్‌లో వీటినే వాడారు. వైమానిక దళంలో వీటి ప్రాముఖ్యత ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫైటర్‌ జెట్లు ప్రతి ఏటా పలువురు యువ ఐఏఎఫ్‌ ట్రైనీలను బలి తీసుకుంటున్నాయి. కారణం ఏంటంటే ఈ ఫైటర్‌ జెట్లు చాలా పురాతనమైనవి కావడంతో.. ట్రైనింగ్‌ సమయంలో కూలి పోతున్నాయి. 

తాజాగా రెండు రోజుల క్రితం మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ పంజాబ్‌ మోగా జిల్లాలో కూలిపోయింది. ప్రమాద సమయంలో దానిలో ఉన్న పైలెట్‌, స్క్వాడ్రోన్‌ లీడర్‌ అభివన్‌ చౌదరి మరణించారు. ఈ క్రమంలో ఆయన తండ్రి ‘‘ఈ ప్రమాదంలో నేను నా కుమారుడిని పొగొట్టుకున్నాను. మరి కొందరు తల్లిదండ్రులకు ఈ గర్భశోకం తప్పాలంటే.. దయచేసి ఈ మిగ్‌ ఫైటర్‌ జెట్లను ఐఏఎఫ్‌ నుంచి తొలగించండి’’ అంటూ ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నారు. 

పంజాబ్‌లోని మోగా జిల్లాలో గురువారం అర్ధరాత్రి తర్వాత మిగ్-21 బైసన్ యుద్ధ విమాన కూలింది. ఈ ప్రమాదంలో స్క్వాడ్రోన్‌ లీడర్‌ అభినవ్‌ చౌదరి మరణించాడు. ఈ వార్త తలెసిన వెంటనే సన్నిహితులు, బంధువులు మీరట్‌లోని అతడి ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అభినవ్‌ చౌదరి తండ్రి మిగ్‌-21 ఫైటర్‌ జెట్లను తొలగించాల్సిందిగా కన్నీటితో వేడుకుంటున్నాడు. 

ఈ సందర్భంగా అభినవ్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘‘1980లోనే రష్యా వీటిని రద్దు చేసింది. ప్రతి ఏటా కుప్ప కూలుతున్న ఈ ఎగిరే శవ పేటికలు అనేక మంది యువకుల కలలను, జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఈ పాత కాలపు యుద్ధ విమానాలను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఫైటర్‌ పైలెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తుంది. అలాంటప్పుడు ఈ అరిగిపోయిన విమానాలను శిక్షణ కోసం ఎందుకు అనుమతిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. 

చదవండి: ముక్కలైన మిగ్‌-21.. పైలెట్‌ దుర్మరణం

మరిన్ని వార్తలు