సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి

17 May, 2023 14:08 IST|Sakshi

భోపాల్‌: ఓ తండ్రి ఏడాది వయసున్న తన బాబుని సీఎం ప్రసంగిస్తుండగా వేదికపైకి విసిరేశాడు. ఈ చర్య అక్కడున్న ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. ఈ విపరీత చర్యకు అతనిపై మొదట ఆగ్రహం వ్యక్తం చేసినా.. చివరికి దీని వెనుక కారణం తెలుసుకుని అతని బాధని అర్థం చేసుకున్నారు. ఆ తండ్రి ఎందుకు ఇలా చేశాడంటే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఖేష్ పటేల్ సాగర్‌లోని కేస్లీ తహసీల్‌లోని సహజ్‌పూర్ గ్రామ నివాసి. అతను తన భార్య నేహా, ఏడాది వయసున్న కుమారుడితో నివసిస్తున్నాడు.

తన కుమారుడికి 3 నెలల వయస్సు ఉన్నప్పుడే వైద్యులు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించి అందుకు బాగా ఖర్చు అవుతుందని చెప్పారు. తనకు అంత స్థోమత లేకపోయినా ఇప్పటి వరకు తన కుమారుడి వైద్యం కోసం రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేశాడు.

అయితే డాక్టర్ సర్జరీ చేయించాలని అందుకు  మరో 3.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడే సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. సాగర్‌ ప్రాంతంలో జరిగిన ఓ సభకు వచ్చారు. అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రిని సహాయం చేయాలని కోరుందుకు ముకేశ్‌, నేహా కూడా వెళ్లారు. అయితే సీఎంని కలవడానికి వారికి అనుమతి దొరకలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ముకేశ్‌.. ముఖ్యమంత్రి స్టేజ్‌పై ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా తన బిడ్డను వేదికపైకి విసిరేశాడు. భద్రతా సిబ్బంది బాబును కాపాడి, తల్లికి అప్పగించారు. మొదట అతనిపై కోపడినప్పటికీ.. చివరికి చిన్నారి సమస్యను తెలుసుకున్న సీఎం బాబుకు వైద్యసహాయం అందించాలని స్థానిక కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు