వణుకుతున్న అఫ్గాన్‌ మహిళా లోకం

17 Aug, 2021 03:55 IST|Sakshi

రెండు దశాబ్దాల తర్వాత మరోమారు పాలనా పగ్గాలు చేపట్టిన తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు మాత్రం కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ భవితవ్యం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మహిళల పరిస్థితేంటి? అనే ప్రశ్నలకు తాలిబన్ల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. అసలు వారికైనా ఈ విషయాలపై స్పష్టత ఉందో, లేదో తెలియదు. గత పాలన సందర్భంగా తాలిబన్లు స్త్రీలను ఎలా చూశారో అందరికీ తెలుసు. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం వంటివి తలుచుకొనే ప్రస్తుతం అఫ్గాన్‌ మహిళా సమాజం ఉలిక్కిపడుతోంది.

ముఖ్యంగా 2001 తర్వాత జన్మించిన యువతకు వీరి ఆగడాలపై అవగాహన లేదు. ప్రస్తుతం తాము మారిపోయామని, మహిళా విద్యను కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా మహిళల భయం తీరడం లేదు. ఇప్పటిౖMðతే మహిళల పట్ల తాలిబన్లు ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేదు. కానీ జూలైలో బందక్షాన్, తఖార్‌ ప్రావిన్సులను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు గుర్తుకొచ్చి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న 15ఏళ్లు దాటిన బాలికలు, 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను తమకివ్వాలని జూలైలో తాలిబన్లు స్థానిక నాయకులను ఆదేశించారు. తాలిబన్‌ ఫైటర్లను పెళ్లి చేసుకోవడానికి వీరు అవసరమని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆదేశాలు అమలయ్యాయా? అయితే అక్కడి ఆడవారి పరిస్థితి ఏంటి? అనే విషయాలపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.

పేరుకు పెళ్లిళ్లు కానీ, ఇవన్నీ యువకులను తమలోకి ఆకర్షించేందుకు తాలిబన్లు చేసే యత్నాలన్నది అందరికీ తెలిసిన సంగతే! ఇలా పెళ్లైనవారు భార్య హోదా పొందకపోగా లైంగిక బానిసలుగా మారడం కద్దు. ఈ ఆదేశాలకు భయపడి చాలా ప్రాంతాల్లో ప్రజలు పారిపోయారు. కేవలం మూడు నెలల్లో దాదాపు 9 లక్షలమంది స్వస్థలాలను విడిచిపోయారంటే తాలిబన్‌ టెర్రర్‌ అర్థమవుతుంది. ఇదే తరహాను కొనసాగిస్తే ఇరవైఏళ్లపాటు అఫ్గాన్‌ మహిళాలోకం సాధించిన విజయాలన్నీ మట్టికొట్టుకుపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించేలా తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావాలని, మహిళా హక్కుల పరిరక్షణకు ఐరాస, ప్రపంచ దేశాలు నడుం బిగించాలని, ఆంక్షలు తొలగించాలంటే స్త్రీస్వేచ్ఛకు లింకు పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

–నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు