ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం.. ఆయన వల్లే!: సుప్రీం కోర్టు కమిటీ నివేదిక

25 Aug, 2022 13:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదట్లో పంజాబ్‌ పర్యటన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసనలతో కొద్దిసేపు ఆయన కాన్వాయ్‌ నిలిచిపోవడం తీవ్ర దుమారం చెలరేగింది. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటనపై సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించగా.. ఆ కమిటీ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఆ రిపోర్ట్‌ను ఇవాళ(గురువారం) సుప్రీం ధర్మాసనం బయటపెట్టింది. 

ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యం వ్యవహారానికి సంబంధించి.. ఫెరోజ్‌పూర్‌(ఫిరోజ్‌పూర్‌) ఎస్‌ఎస్‌పీ(సీనియర్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌) నిర్లక్ష్యమే కారణమని నివేదిక వెల్లడించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. కమిటీ నివేదికను చదివి వినిపించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన బెంచ్‌.. సరిపడా సిబ్బంది ఉన్నా ఫెరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ విధి నిర్వహణలో విఫలం అయ్యారని, అదీగాక ప్రధాని మోదీ పర్యటన గురించి రెండు గంటల ముందే ఆయనకు(ఫెరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ) సమాచారం ఉన్నా సరైన చర్యలు చేపట్టలేకపోయారని కమిటీ నివేదిక పేర్కొందని తెలిపారు.  

ఇది సెంట్రల్‌ ఏజెన్సీల వైఫల్యం ఎంత మాత్రంకాదని, కేవలం పంజాబ్‌ పోలీస్‌ అధికారి వైఫల్యమని తమ దర్యాప్తులో స్పష్టంగా తేలిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, తద్వారా సంబంధిత చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. 

ఇదిలా ఉంటే.. జనవరి 5వ తేదీ, 2022 పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ కాన్వాయ్‌.. రైతుల నిరసనలతో ఫెరోజ్‌పూర్‌-మోగా మార్గంలో పియారియానా రోడ్డు ఓవర్‌బ్రిడ్జిపై సుమారు 20 నిమిషాలపాటు ఆగిపోయింది. ఊహించని ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధానికి ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో భద్రతపై ఆందోళన వ్యక్తం అయ్యింది. విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జితో ఓ కమిటీని నియమించగా.. అందుకు సంబంధించిన నివేదికను కూడా సీల్డ్‌ కవర్‌లో తమకు సమర్పించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మరిన్ని వార్తలు