ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌పై కొరడా

12 May, 2023 06:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఎగబాకడం, రైతుల నుండి పెరిగిన డిమాండ్, తగ్గిన సరఫరా కారణంగా దేశంలో ఎక్కువైన ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం దృష్టిసారించింది. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు దిగింది. బ్లాక్‌మార్కెటింగ్‌ అరికట్టేందుకు కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 370 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

తెలంగాణలో నాలుగు యూరియా డైవర్షన్‌ యూనిట్లలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మిశ్రమ యూనిట్‌లో తనిఖీలు చేశాయి. మరో వారం పాటు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. తనిఖీల సందర్భంగా గుజరాత్, కేరళ, హరియాణా, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏకంగా 70,000 బస్తాల నకిలీ యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.

దీనికి సంబంధించి ఇప్పటిదాకా 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా, 112 మిశ్రమ తయారీదారులను డీఆథరైజ్‌ చేసినట్లు వెల్లడించింది. దాదాపు రూ. 2,500 ఖరీదు చేసే 45 కిలోల యూరియా బస్తాను రైతులకు వ్యవసాయ అవసరాలకు రాయితీపై రూ.266కే కేంద్రం అందిస్తోంది. అయితే డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో సబ్సిడీ ధరకు యూరియాను పొందలేకపోతున్న రైతన్నలు మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

మరిన్ని వార్తలు