కేంద్ర ఉద్యోగులకు బొనాంజా

13 Oct, 2020 03:35 IST|Sakshi

ఎల్‌టీసీకి బదులుగా క్యాష్‌

ఓచర్లు, రూ. 10 వేల శాలరీ అడ్వాన్స్‌

రాష్ట్రాలకు రుణంగా రూ. 12 వేల కోట్లు

ప్యాకేజీ ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌

న్యూఢిల్లీ:  పండుగ సీజన్‌ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో వినిమయ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల వేతన అడ్వాన్స్‌ను, ఎల్‌టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు రూ. 12 వేల కోట్లను కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.

ఆర్థిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులకు ఇచ్చే లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌(ఎల్‌టీసీ) స్థానంలో ఈ సంవత్సరం క్యాష్‌ ఓచర్లను ఇస్తారు. జీఎస్టీ రిజిస్టర్డ్‌ అమ్మకందారు వద్ద, డిజిటల్‌ మోడ్‌లో, 12% లేదా అంతకుమించి జీఎస్టీ ఉన్న వస్తువులను కొనేందుకే వాటిని వినియోగించాలి. ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు ఆ ఓచర్లను వినియోగించడం కుదరదు. 2021 మార్చి 31లోగా వాడేయాలి. ఎల్‌టీసీ ద్వారా పొందే విమాన/రైలు చార్జీ కన్నా 3 రెట్లు ఎక్కువ విలువైన వస్తువులు/ సేవలను కొనుగోలు చేయాలి.  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు ఎల్‌టీసీల స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వనున్నాయి.

శాలరీ అడ్వాన్స్, ఎల్‌టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో రూ. 28 వేల కోట్ల విలువైన డిమాండ్‌ ఉంటుందని నిర్మల వెల్లడించారు. ఎల్‌టీసీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు  రంగ సంస్థలకు కూడా, షరతులకు లోబడి, సంబంధిత మొత్తంపై పన్ను రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. రూ. 10 వేల శాలరీ అడ్వాన్స్‌ను 2021మార్చి 31లోగా ఉద్యోగులు ప్రీలోడెడ్‌ రూపే కార్డుల రూపంలో తీసుకోవాలి. వడ్డీ లేని ఆ రుణాన్ని గరిష్టంగా 10 వాయిదాల్లో చెల్లించాలి. సొంత ఊరికి లేదా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలు షరతులతో ఉద్యోగులకు ఎల్‌టీసీ లభిస్తుంది. అయితే, కరోనా కారణంగా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.  

మొత్తం రూ. 73 వేల కోట్ల ఉద్దీపన
ఎల్‌టీసీ క్యాష్‌ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్‌ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో ఎల్‌టీసీ, శా లరీ అడ్వాన్స్‌ కోసం రూ. 11,575 కోట్లు, రా ష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయన్నారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని తెలిపారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ. 7,500 కోట్లు ఇతర రా ష్ట్రాలకు కేటాయించామన్నారు. ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు