సింఘు నుంచి సొంతూళ్లకు..

12 Dec, 2021 10:10 IST|Sakshi

న్యూఢిల్లీ/చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా నిరసనలకు ప్రధాన వేదికగా కొనసాగిన ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని సింఘు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు, వారి ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతులు ఇళ్లకు మరిలారు. ఈ సందర్భంగా రైతులు కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. జాతీయ జెండాలు, రైతు సంఘాల జెండాలు, రంగుల విద్యుత్‌ దీపాలతో ట్రాక్టర్‌ ట్రాలీలను అందంగా అలంకరించారు.

(చదవండి: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!)

ఇప్పటి వరకు సింఘు, ఘాజీపూర్, టిక్రీ నిరసన శిబిరాల్లో ఉపయోగించుకున్న టెంట్లు, ఇతర సామగ్రిని ట్రాలీల్లో వేసుకుని పంజాబ్, హరియాణా, యూపీ రైతులు తిరుగు పయనమయ్యారు. సింఘు ప్రాంతం భాంగ్రా నృత్యాలు, పాటలు, కీర్తనలతో మారుమోగింది. ఏడాదిపాటు ఇక్కడ గడిపిన తమకు ఈ ప్రాంతంతో, ఇక్కడి వారితో అనుబంధం ఏర్పడిందని కొందరు రైతులు అన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లడం కొంతబాధాకరంగానే ఉందని ఉద్విగ్నానికి లోనయ్యారు.  

జాతీయరహదారులపై పండుగ వాతావరణం 
డిమాండ్లను సాధించుకుని ఇళ్లకు వస్తున్న రైతులకు పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ–కర్నాల్‌–అంబాలా, ఢిల్లీ–హిసార్‌ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ప్రజలు వారికి ఎదురెళ్లి పూల వర్షం కురిపించి, స్వీట్లు తినిపించి, పూలమాలలతో సత్కరించారు.  రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన సింఘు, టిక్రి, ఘాజీపూర్, షాజహాన్‌పూర్‌లు హిందువుల పుణ్యక్షేత్రాలైన చార్‌ధామ్‌లుగా స్వరాజ్‌ ఇండియా సంస్థ అధ్యక్షుడు యోగీంద్రయాదవ్‌ అభివర్ణించారు.  కాగా, రైతుల నిరసనల కారణంగా నిలిచిపోయిన ఈ నాలుగు ప్రాంతాల్లోని టోల్‌ప్లాజాలను రెండు, మూడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని జాతీయరహదారుల అధికారులు తెలిపారు. 

ఇద్దరు రైతులు మృతి 
టిక్రి నుంచి ఇళ్లకు వెళ్తున్న రైతుల ట్రాలీ ఒకటి హరియాణాలోని హిసార్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక ట్రక్కు ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి ఢీకొనడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

(చదవండి: గ్రహాంతరవాసులను చూసేందకు వెళ్తున్నా!... అంటూ హాస్యగాడిలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే చివరికి!!)

>
మరిన్ని వార్తలు