ఆగ్రా వాసులను భయపెడుతున్న కోతులు

6 Oct, 2020 20:39 IST|Sakshi

లక్నో: తాజ్‌ నగరం నడిబొడ్డున రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన కొట్లాట ఇద్దరి మృతికి కారణమయ్యింది. వివరాలు.. సత్సంగ్‌ గాలీలోని ఓ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని, మరో వ్యక్తి గోడ పక్కన నిలబడి ఉన్నారు. ఇంతలో రెండు కోతుల గుంపు ఆ గోడ మీద చోటు కోసం పోట్లాడుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో గోడ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇంటి యజమాని, మరోక వ్యక్తి మీద శిథిలాలు పడ్డాయి. దాంతో వారు తీవ్రంగా గాయపడటమే కాక మరణించారు. చనిపోయిన వ్యక్తులను లక్ష్మణ్‌ తులసి, వీరాగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి ప్రాణాంతక సంఘటనలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు కోతులను నగరం నుంచి తరిమెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు. (దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు)

వానరాల బెడద తప్పించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆగ్రా జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. అయితే గతంలో కార్పొరేషన్‌ కోతులను తరిమే ప్రయత్నం చేసింది. కానీ జంతు ప్రేమికులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ కోతులు స్థానికులను కాక పర్యాటకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత ఏడాది ఒక కోతి రునుక్త గ్రామంలో తల్లి ఒడిలో ఉ‍న్న పసికందును లాక్కెళ్లి చంపేసింది. 

మరిన్ని వార్తలు