కేరళ: అర్జెంటీనా అభిమానుల అతి.. హింసాత్మకంగా మారిన ఫిఫా సంబురాలు.. ముగ్గురికి కత్తిపోట్లు

19 Dec, 2022 16:53 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్‌లోనూ ఈ ఆటకు కోట్లలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. ముఖ్యంగా కేరళ ప్రజలు షుట్‌ బాల్‌ ఆటను విపరీతంగా ఫాలో అవుతుంటారు.  ఖతర్‌ వేదికగా జరిగిన 2022 ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో అర్జెంటీనా ఫ్రాన్స్‌ హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ​ పోరులో చివరికి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాదే పైచేయి అయ్యింది. 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ టైటిల్‌ను అర్జెంటీనా ముద్దాడింది. దీంతో మెస్సీ అభిమానులు వీర లెవల్లో పండగ చేసుకుంటున్నారు.

ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ సందర్భంగా కేరళలోని ఫ్యాన్స్‌ అర్జెంటీనా, ఫ్రాన్స్‌ జెర్సీలు ధరించి జెండాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. జట్టు సభ్యుల భారీ కటౌట్లతో హోరెత్తించారు. ఫ్రాన్స్‌పై అర్జెంటీనా బృందం అద్భుత విజయం సాధించడంతో కేరళలో సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వీట్లు,  ఉచితంగా ఫుడ్‌ పంపిణీ చేస్తూ.. రోడ్లపై టపాసులు పేల్చుతూ డ్యాన్స్‌లతో అర్జెంటీనా విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు. అయితే వేడుకలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి.

కేరళలోని కన్నూర్‌లో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కొచ్చిలోని కలూర్‌లో అర్జెంటీనా అభిమానుల బృందం మద్యం సేవించి బైక్‌లపై ఊరేగింపుతో హంగామా సృష్టించారు. వీరిని నియత్రించడానికి ప్రయత్నించిన ముగ్గురు పోలీసులు సైతం గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకోగా, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

అదే విధంగా తిరువనంతపురం, పొజియూర్‌లో విజయోత్సవ వేడుకలను నియంత్రించేందుకు ప్రయత్నించిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లంలో వేడుకల్లో పాల్గొన్న 18 ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందాడు.

>
మరిన్ని వార్తలు