నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్‌ కళాకారుల ప్రదర్శనలు

30 Nov, 2023 13:49 IST|Sakshi

యూపీలోని అయోధ్యలో నిర్మితమవుతున్న నూతన రామాలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రామలీల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో సినిమా ఆర్టిస్టులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. అలాగే పాకిస్తాన్‌తో సహా 14 దేశాలకు చెందిన కళాకారులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారు.  

రాముని కథను సజీవంగా ప్రదర్శించేందుకు వీరంతా ఇప్పటి నుంచే సాధన చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి జనవరిలో అత్యంత వైభవంగా రామలీలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా రామలీల కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజున జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 జనవరి 17 నుంచి 22 వరకు సరయూ తీరంలో ఉన్న రామకథా పార్క్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. 

రాబోయే జనవరిలో జరిగే రామలీలలో తొలిసారిగా సినీ కళాకారులతో పాటు విదేశీ కళాకారులు కూడా కనిపించనున్నారని రామలీల కమిటీ చైర్మన్ సుభాష్ మాలిక్ తెలిపారు. రష్యా, మలేషియా, అమెరికా, లండన్, దుబాయ్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు చెందిన కళాకారులు అయోధ్యలో జరిగే  రామలీలలో కనిపించనున్నారని పేర్కొన్నారు. 

అనేక దేశాల కళాకారులు, సినీ కళాకారులతో సంయుక్తంగా రామలీలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. అది కూడా శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది. రామ్‌లీల కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ప్రారంభిస్తారని కమిటీ ప్రధాన కార్యదర్శి శుభమ్ మాలిక్ తెలిపారు. కాగా ఈ ఏడాది దసరా సందర్భంగా జరిగిన రామలీల కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో 32 కోట్ల మంది వీక్షించారు.
ఇది కూడా చదవండి: అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ కన్నుమూత!

మరిన్ని వార్తలు