గుజరాత్‌ ఎన్నికల వేళ ఆప్‌ నేత ఓవరాక్షన్‌.. కేసు నమోదు!

17 Nov, 2022 11:28 IST|Sakshi

AAP Jagmal Vala.. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆప్‌ అభ్యర్థి కిడ్నాప్‌ వ్యవహారం మరువక ముందే మరో ఆప్‌ నేత హల్‌చల్‌ చేశారు. టోల్‌ ప్లాజా వద్ద ఆప్‌ గుజరాత్‌ వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జగ్మల్‌వాలా రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్, సోమ్‌నాథ్ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థి జగ్మల్ వాలా టోల్ ప్లాజా వద్ద ఓవరాక్షన్‌ చేశారు. వెరావల్ సమీపంలోని దరి టోల్ ప్లాజా నుండి జగ్మల్‌ వాలా తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి మూడు వాహనాల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారిని టోల్‌ ప్లాజా సిబ్బంది నిలిపివేశారు. దీంతో, ఆగ్రహానికి లోనైన ఆప్‌ నేత.. అక్కడున్న సిబ్బందితో గొడవపడ్డారు. టోల్ బూత్ ఉద్యోగిపై దాడికి దిగారు. ఈ ఘటన అంతా ప్లాజాలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.

ఇక, ఈ ఘటనపై టోల్ బూత్ వర్కర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఆప్‌ నేత జగ్మల్‌ వాలాపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిని తన సొంత కార్యాలయంలో బెదిరించి కొట్టిన కేసులో జగ్మల్ వాలా ఇప్పటికే జైలు శిక్ష అనుభవించాడు. కాగా, మరికొద్ది రోజుల్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ఉండగా.. ఆప్‌ కీలక నేత ఇలా ప్రవర్తించడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు.. గుజరాత్‌లో ఆప్‌ అభ్యర్థి కిడ్నాప్‌కు గురయ్యారని ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేసిన వేళ.. స్వయంగా అభ్యర్థి కంచన్ జరీవాల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో సందేశం విడుదల చేశారు. తన మనస్సాక్షి చెప్పినట్టే చేశానని, స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, ఎవరూ ఒత్తిడి చేయలేది స్పష్టం చేశారు. దీంతో ఆప్‌ నేతలు షాక్ అయ్యారు.
 

మరిన్ని వార్తలు