యూపీ మాజీ సీఎం‌పై కేసు నమోదు

13 Mar, 2021 20:34 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జర్నలిస్టులపై దాడి చేశారనే ఆరోపణలతో  మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, 20 మంది సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను నెట్టివేయడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలవారు వేరువేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని యూపీ శాంతి భద్రతల ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. వారి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ ఘటనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు షలాబ్‌మణి త్రిపాఠి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారని సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు వీధిరౌడీల మాదిరిగా జర్నలిస్టులపై దారుణంగా దాడి చేశారని ఆరోపించారు. అదే విధంగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. భారతదేశ ప్రజాస్వామ్యానికి భావప్రకటనా స్వేచ్ఛ ప్రధానమైందని గుర్తుచేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.

(చదవండి:ట్రాక్టర్‌‌ ర్యాలీకి డీజిల్‌ నిషేధం బీజేపీ కుట్ర: అఖిలేష్‌ యాదవ్‌)

>
మరిన్ని వార్తలు