పలు రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం

7 Nov, 2020 04:48 IST|Sakshi

ఢిల్లీ నుంచి రాజస్తాన్‌ వరకు పలు రాష్ట్రాల నిర్ణయం

కార్మికుల ఉపాధి పోతుందని తమిళనాడు ఆందోళన

న్యూఢిల్లీ: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తే , మరికొన్ని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కాలుష్య కారక టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. కరోనా వైరస్‌ విజృంభణ, కాలుష్యం పెరిగిపోతూ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. టపాసులపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్తాన్, సిక్కిం, కర్ణాటక ఉన్నాయి.

బాణసంచా కాల్చడంతో వాయుకాలుష్యం పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని, కోవిడ్‌ విజృంభిస్తున్న వేళ టపాసులు కాల్చడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పడంతో పలు రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. ఢిల్లీలో నవంబర్‌ 30 వరకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.. ఒక్కో రాష్ట్రం బాణసంచా కాల్చడంలో నిషేధం విధించడంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో బాణసంచాలో 90% తమిళనాడులోని శివకాశి ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ ఉండడంతో చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్యం పెరగకుండా చూడండి: సుప్రీంకోర్టు
ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో దానిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగ నేపథ్యంలో రాజధానిలో కాలుష్యం పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన బెంచ్‌ వీలైనంత త్వరగా కాలుష్య నివారణకు ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు