అందుకే ఆ గ్యాప్‌ ఇచ్చాం: ఐసీఎంఆర్‌ చీఫ్‌

21 May, 2021 10:27 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్న వారిలో  రోగ నిరోధక శక్తి  ఎక్కువగా పెరిగినట్టు గుర్తించామని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ ప్రకటించారు. తొలి డోసు ప్రభావ శీలత ఎక్కువగా ఉన్నందునే  రెండు డోసుల మధ్య వ్యవధిని ఆరు వారాల నుంచి మూడు నెలలకు పెంచినట్టు వివరించారు.  అదే సమయంలో కోవాగ్జిన్‌ తొలి డోసు ప్రభావం ఎక్కువగా లేదని,  అందుకే రెండు డోసుల మధ్య  వ్యవధిని పెంచలేదన్నారు.  కోవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య గ్యాప్‌ పెంచడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుందన్నారు బలరాం భార్గవ. కోవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య గ్యాప్‌ పెంచడం వల్ల సానుకూల ఫలితాలే వస్తాయన్నారు. 

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత నాలుగు వారాల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని తొలుత ప్రకటించింది కేంద్రం. వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు ఇదే వ్యవధిలో టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవధిని 6 నుంచి 8 వారాలకు పెంచారు.  కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత రెండు డోసుల మధ్య వ్యవధిని 6 నెలలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

దీనిపై విమర్శలు రావడంతో ఈ గ్యాప్‌ని 3 నెలలకు కుదించింది కేంద్రం. తరచుగా కోవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని మార్చుతుండటంతో  కేంద్రంపై నలువైపులా విమర్శలు వెల్లువెత్తాయి.  వ్యాక్సిన్ల కొరత సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం కోవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచిందంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి.  దీంతో ఈ విమర్శలకు సమాధానం ఇచ్చే పనిలో భాగంగానే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చీఫ్‌ బలరాం భార్గవ వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు