Whale Vomit: వాంతి విలువ రూ.28 కోట్లు!

27 Jul, 2022 07:25 IST|Sakshi

తిరువనంతపురం: ఛీ.. ఏంటిది? నిజమేనా.. వాంతికి కోట్లు పలకడం ఏమిటని అవాక్కవుతున్నారా? ఏదైనా పడనిది.. పనికిరానిది తిన్నప్పుడు వాంతి రావడం సహజమే.. శరీరమే విసర్జించిన దాంట్లో విలువైనది ఏముంటుందబ్బా అని తెగ ఆలోచిస్తున్నారా? అంత బుర్రబద్దలు కొట్టుకోకండి.. ఎందుకంటే ఇది మనుషుల వాంతి కాదు.. ఓ భారీ తిమింగలానిది. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని వంజిమ్‌లో కొందరు జాలర్లు తాజాగా సముద్రంలో చేపల వేటకు వెళ్లగా వారి వలకు ఏదో చిక్కింది. దీంతో సంబరపడ్డ వారు వలను లాగి చూడగా అందులో ఏకంగా 28.4 కిలోల బరువైన స్పర్మ్‌ వేల్‌ వాంతి కనిపించింది!

అంతరించే దశలో ఉన్న ఈ జాతి తిమింగలాలకు చెందిన పదార్థాలను విక్రయించడాన్ని కేంద్రం వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద నిషేధించడంతో జాలర్లు పోలీసులకు అప్పగించారు. వారు దాన్ని అటవీ అధికారులకు ఇవ్వగా ఆ అధికారులు అది తిమింగలం వాంతా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీకి తరలించారు.పర్ఫ్యూమ్‌ల తయారీలో ఉపయోగించే తిమింగలం వాంతి కిలో ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. కోటి వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన జాలర్లకు దొరికిన తిమింగలం వాంతి విలువ రూ. 28 కోట్లకుపైనే ఉంటుందని లెక్కగట్టాయి.

ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ

మరిన్ని వార్తలు