నీటమునిగి ఐదుగురు చిన్నారుల మృతి

3 Jul, 2021 09:54 IST|Sakshi
ఇషాంత్, షణ్ముగప్రియ, భువన్, మదన్‌  

చెన్నై: వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు చిన్నారులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. తెన్‌కాశి జిల్లా ఆలంగుళం సమీపంలోని షణ్ముగపురానికి చెందిన ధర్మరాజ్‌ (36) కుమారుడు భువన్‌ (05), ధర్మరాజ్‌ తమ్ముడు కన్నన్‌ కుమారుడు ఇషాంత్‌ (05), అదే ప్రాంతానికి చెందిన బంధువు భూపాలన్‌ కుమార్తె షణ్ముగప్రియ (05) ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు భువన్, ఇషాంత్, షణ్ముగప్రియ ఇంటి సమీపాన కొలను వద్ద ఆటాడుకునేందుకు వెళ్లారు. కట్టడ పని చేస్తున్న ఓ కార్మికుడు భోజనం చేయడానికి చేతులు కడుక్కునేందుకు కొలను వద్దకు వెళ్లగా భువన్‌ నీటిలో తేలుతున్నట్లు గమనించి అతన్ని ఒడ్డుకు తీసుకువచ్చాడు.

ఇంతలో విషయం తెలుసుకున్న బంధువు అక్కడకు వచ్చి ఇషాంత్, షణ్ముగప్రియ కోసం గాలించి వారిని కూడా వెలుపలికి తీసుకువచ్చాడు.. తర్వాత ముగ్గురిని ఆలంగుళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు వారంతా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆలంగుళం డీఎస్పీ పొన్నివళవన్‌ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తెన్‌కాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపి విచారణ జరుపుతున్నారు. 

మరో సంఘటన 
ఆలంగుళం సమీపంలోని మారందైకి చెందిన సురేష్, వళ్లి దంపతులకు కుమారులు మదన్‌ (07), రాహుల్‌ (05) ఉన్నారు. ఇద్దరు తాత, అవ్వలు రామయ్య, గణపతి అమ్మాళ్‌లతో పశువుల మేతకు వెళుతుంటారు. గురువారం రామయ్య తెన్‌కాశి ఆసుపత్రికి వెళ్లడంతో చిన్నారులు గణపతి అమ్మాళ్‌తో పశువులు మేపేందుకు వెళ్లారు. సమీపాన ఉన్న కాలువలో నీరు తాగేందుకు వెళ్లగా మదన్‌ కాలువలో పడిపోయాడు. దీనిని గమనించిన తమ్ముడు రాహుల్‌ అవ్వకు తెలపడంతో స్థానికులు మదన్‌ మృతదేహాన్ని వెలికితీశారు.

ఆలంగుళం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తెన్‌కాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అలాగే నెల్‌లై పారయడికి చెందిన బాలకృష్ణన్‌ కుమార్తె కయల్‌(4) ఇంటి సమీపంలోని కాలువలో స్నానం చేసేందుకు వెళ్లింది. నీటిలో మునిగి మృతి చెందింది. శుద్ధమల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు