ఒడిశా రైలు ప్రమాదం: ఒక మృతదేహం కోసం ఐదుగురు వాదన.. పరిష్కారం కోసం..

7 Jun, 2023 08:20 IST|Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలు కుటుంబాలు  అయినవారని కోల్పోయాయి. కొంతమంది ఇంటి పెద్దను కోల్పోగా, కొన్ని కుటుంబాల్లో ఎదిగొచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కొందరు తల్లిని కోల్పోగా, మరికొందరు తండ్రిని కోల్పోయారు... ఇలా చాలా జీవితాలు విచ్ఛిన్నమయ్యాయి. అయితే ప్రస్తుతం మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకోవడంతో అవి ఎవరివనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఈ నేపద్యంలో ఒక మృతదేహం తమవారిదేనంటూ ఐదుగురు వాదనకుదిగడం కనిపించింది. దీంతో వీరి సమస్య పరిష్కారం కోసం డీఎన్‌ఏ సహాయం తీసుకోనున్నారు.

ఈ రైలు ప్రమాదంలో మొత్తం 288 ప్రాణాలు కోల్పోగా, 205 మృతదేహాలకు శవపంచనామా పూర్తయ్యింది. మిగిలిన మృతదేహాలకు ఈ ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది.  ఈ ప్రమాదంలో వెయ్యిమందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. బాధితుడు మెహమ్మద్‌ ఇనామ్‌ ఉల్‌ హక్‌ మాట్లాడుతూ తన ఇద్దరు బావలతో పాటు తన సోదరుడు కూడా ఈ రైలు ప్రమాదంలో మృతిచెందాడని, వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వచ్చామన్నారు. ఇందుకోసం ఇక్కడ నాలుగు రోజులుగా తిరుగుతున్నామన్నారు.  ఏఐఐఎంలో ఒక బావ మృతదేహం లభ్యంకాగా, మరో బావ, సోదరుని మృతదేహం కోసం వెదుకులాట సాగించామన్నారు.

తన మరో బావ మృతదేహం లభ్యమైనా, అది తమవారిదేనంటూ ఐదుగురు బాధితులు చెబుతున్నారన్నారు. దీంతో డీఎన్‌ఏ టెస్టు చేసి, ఆ మృతదేహం ఎవరిదో నిర్ధారించి, ఆ బాధిత కుటుంబానికి అధికారులు అందజేస్తారన్నారు. అయితే ఇందుకోసం మరింత సమయం పడుతుందన్నారు. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో 12 ఏళ్ల మనుమడిని కోల్పోయిన తాత నిజాముద్దీన్‌ మాట్లాడుతూ తన మనుమని మృతదేహం లభ్యమైనప్పటికీ ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుని, మరో మనుమని మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదన్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కేవలం తన ఒక మనుమని మృతదేహాన్ని తీసుకుని వెళుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 

చదవండి: బాధితులకు రూ. 2000 నోట్లు!

మరిన్ని వార్తలు