ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

6 Feb, 2023 12:15 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్, పాట్నా, మణిపూర్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన సంగతి తెలిసిందే. 

గత ఏడాది డిసెంబర్‌ 13వ తేదీన కొలీజియం పంపిన సిఫారసులకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో కొత్తగా శనివారం ఐదుగురు జడ్జిలు నియమితులయ్యారు. ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి ప్రస్తుతమున్న 27 నుంచి 32కు చేరనుంది. అత్యున్నత న్యాయస్థానంలో వాస్తవంగా 34 మంది జడ్జీలు ఉండాల్సింది.

న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలపడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు