కమలదళం మేధోమథనం

7 Nov, 2021 04:56 IST|Sakshi

నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహ రచన

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది.

పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్‌–19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ తెలిపారు. 124 మంది కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రత్యక్షంగా హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గంలోని ఇతర సభ్యులు రాష్ట్ర కార్యాలయాల్లో వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొంటారు.

తెలంగాణ నుంచి బండి సంజయ్, వివేక్‌ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొననున్నారు.  వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌లో వచ్చే ఏడాది ఆఖర్లో ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏడు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో మేధోమథనం నిర్వహించనున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహం రూపొందించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు