బీజేపీలోకి మరో ఐదుగురు టీఎంసీ నాయకులు

30 Jan, 2021 20:10 IST|Sakshi

ఢిల్లీ చేరుకున్న టీఎంసీ నాయకులు

అమిత్‌ షా సమక్షంలో బీజేపీలోకి చేరిక

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పశ్చిమబెంగాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సువేందు అధికారి నుంచి బీజేపీలోకి మొదలైన వలసల పర్వ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా టీఎంసీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలు బీజేపీలో చేరనున్నారు. వాస్తవానికి వీరంతా రేపు హౌరాలో అమిత్ షా నిర్వహించనున్న ర్యాలీలో బీజేపీలో చేరాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వీరంతా శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వీరంతా ఇప్పటికే టీఎంసీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరనున్న వారిలో ఎమ్మల్యేలు వైశాలి దాల్మియా, ప్రబిర్ ఘోషల్, హౌరా మేయర్ రతిన్ చక్రవర్తితో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, పౌర సంబంధిత శాఖకు ఐదు సార్లు చీఫ్‌గా పని చేసిన రంగనాథ్ పార్థసారథి ఛటర్జీ ఉన్నారు.
(చదవండి: బెంగాల్‌పై కాషాయం కన్ను )

హౌరాలోని డుముర్జోలాలో ఆదివారం బీజేపీ తల పెట్టిన మెగా ర్యాలీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని సమాచారం. ఈ ర్యాలీలో అమిత్‌ షా వర్చువల్‌గా పాల్గొంటారు. ఇక ఆయనతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొననున్నారు. శుక్రవారం పోల్ స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించిన తృణమూల్, పార్టీ నుంచి వెళ్లే వారిపై దృష్టి పెట్టకుండా.. ప్రచారంపై ఫోకస్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాక పార్టీ విడిచి వెళ్లిన వారి గురించి ఎలాంటి బ్యాడ్‌ కామెం‍ట్స్‌ చేయకూడదని.. దాని వల్ల ఓటరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు