అంబులెన్స్‌ చార్జీలు.. కీలక ఆదేశాలు

12 Sep, 2020 09:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్‌ మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి

న్యూఢిల్లీ: కోవిడ్‌ సోకినవారినీ, కోవిడ్‌ అనుమానితులను ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్‌లకు విపరీతంగా చార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఎర్త్‌ అనే సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు అంబులెన్స్‌ చార్జీలను రాష్ట్రప్రభుత్వాలు నిర్ధారించాలని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఇప్పటికే వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకూ తగిన మార్గదర్శకాలు విడుదల చేసిందనీ, వాటిని అన్ని రాష్ట్రప్రభుత్వాలు అమలు చేయాల్సిందేనని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేననీ, అంబులెన్స్‌ సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు చేపట్టాలని, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా లతో కూడిన ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో అంబులెన్స్‌ చార్జీల ప్రస్తావన లేదనీ, అందుకే ఆసుపత్రులు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషన్‌ దారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

కొన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను పాటించడం లేదని రోగుల నుంచి 7000 నుంచి 50,000 వరకు అంబులెన్స్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని కోర్టు దృష్టికి వచ్చినట్టు ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రప్రభుత్వాలు సమంజసమైన చార్జీలను నిర్ణయిస్తాయి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అంబులెన్స్‌లను నడపాలని బెంచ్‌ స్పష్టం చేసింది. (400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు)

మరిన్ని వార్తలు