బ్రిటన్‌ ప్రయాణికులకు కరోనా టెస్ట్‌

3 Jan, 2021 04:20 IST|Sakshi

కొత్త మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు తప్పని సరిచేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 8 నుంచి జనవరి 30 వ తేదీ వరకు బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులందరూ సొంత ఖర్చుతో తప్పనిసరిగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలంటూ కేంద్రం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు.

కొత్త కరోనా యూకేలో బయటపడి, అత్యంత వేగంగా విస్తరిస్తోండడంతో డిసెంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 31 వరకు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై భారత్‌ నిషే«ధం విధించింది. ఆ తరువాత నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగించింది. బ్రిటన్‌ నుంచి భారత్‌కి వారానికి కేవలం 30 విమానాలను నడుపుతున్నారు. జనవరి 23 వరకు ఇలాగే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. ప్రయాణికుల వద్ద తప్పనిసరిగా కోవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉండేలా వైమానిక సిబ్బంది చూసుకోవాలి. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల ఫలితం వచ్చే వరకు ప్రయాణీకులు వేచి ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి.

సంబంధిత రాష్ట్రాల అధికారులను సంప్రదించి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులను ప్రత్యేక యూనిట్లలో సంస్థాగత ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్‌ పేషెంట్లకు తిరిగి 14వ రోజు మళ్ళీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నెగెటివ్‌ వచ్చే వరకు వారిని ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్‌ వచ్చిన ప్రయాణీకుల పక్క సీట్లలో కూర్చున్న వారినీ, ముందు మూడు వరుసలు వెనక మూడు వరసల్లో ప్రయాణించిన వారిని క్వారంటైన్‌సెంటర్లలో ఉంచాలని వివరించారు. విమానాశ్రయంలో నెగెటివ్‌ వచ్చినప్పటికీ 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లోనే ప్రయాణికులు ఉండాలి. రాష్ట్ర లేదా జిల్లా అధికార యంత్రాంగం వీరిని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈ మార్గదర్శకాలు సక్రమంగా అమలు జరిగేందుకు విమానాశ్రయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.

6 నుంచి యూకేకు విమానాలు
ఇండియా–యూకే మధ్య విమాన సేవలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీన భారత్‌ నుంచి యూకేకు, 8వ తేదీన యూకే నుంచి ఇండియాకు ఫ్లయిట్లు ప్రారంభమవుతాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. ప్రతి వారం 30 విమానాలను నడుపుతాయని చెప్పారు. ఇందులో ఇండియా, యూకేవి తలా పదిహేను విమానాలుంటాయన్నారు. ఈ షెడ్యూల్‌ జనవరి 23 వరకు కొనసాగుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం డిసెంబర్‌ 23న ఇండియా–యూకేల మధ్య విమాన సర్వీస్‌లను రద్దు చేయడం తెల్సిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు