కోటి టీకాలు ‘నర్సింగ్‌’ అంకితభావం ఫలితమే 

16 Sep, 2021 13:10 IST|Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

వర్చువల్‌ ద్వారా ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుల ప్రదానం 

సాక్షి, న్యూఢిల్లీ: నర్సింగ్‌ సిబ్బంది అంకితభావం వల్లే దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కోటి టీకాలు అందించడం సాధ్యమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం నర్సింగ్‌ సిబ్బందికి జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నర్సింగ్‌ సిబ్బంది అవిశ్రాంత మద్దతు వల్లే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామని కొనియాడారు. కరోనా సమయంలో సేవలందిస్తూ చాలామంది నర్సింగ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

నైటింగేల్‌ అవార్డు గ్రహీతల్లో ఒకరు కూడా ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ‘నర్సెస్‌: ఎ వాయిస్‌ టు లీడ్‌.. ఎ విజన్‌ ఫర్‌ ఫ్యూచర్‌ హెల్త్‌కేర్‌’థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ని ర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుకు ఎంపికైన వారికి వర్చువల్‌ ద్వారా రాష్ట్రపతి అవార్డు అందజేశారు. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిం చారు. అవార్డు, ధ్రువపత్రం, రూ.25 వేల నగదును అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. ఏపీ, తెలంగాణల నుంచి నలుగురుకి ఈ అవార్డు దక్కింది.  

ఏపీ, తెలంగాణల నుంచి నలుగురికి అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో 12 ఏళ్లుగా సేవలందిస్తున్న డి.రూపకళ, తిరుపతి వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ అములూరు పద్మజ, హైదరాబాద్‌లోని అఫ్జల్‌ సాగర్‌కు చెందిన అనపర్తి అరుణకుమారి, వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపురం సబ్‌సెంటర్‌కు చెందిన ఎన్‌వీ షుకురా ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు అందుకున్నారు.   
 

మరిన్ని వార్తలు