Mask: ఈ స్మార్ట్‌ మాస్క్‌లకు పెళ్లి పిల్ల, పిలగాడు ఫిదా అవ్వాల్సిందే!

18 Aug, 2021 16:06 IST|Sakshi

సూపర్‌ మాస్క్‌లతో అవగాహన పెంచుతున్న పూల వ్యాపారి

ప్లవర్‌ మాస్క్‌లతో వధూవరులు మరింత అందంగా ఉంటారు : పూల వ్యాపారి మోహన్‌

సాక్షి, చెన్నై:  కరోనా కష్టకాలంలో తప్పనిసరిగా ధరించాల్సిన ఫేస్‌ మాస్క్‌ల కష్టాలగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊపిరాడదని కొందరు, కరోనా వచ్చాక ఏమో గానీ, మాస్క్‌ పెట్టుకుంటే ఊపిరి అందక ముందే చచ్చిపోతామంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా  కోవిడ్‌-19 మహమ్మారి  ఉధృతిని అడ్డుకోవాలంటే మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి పీటల మధ్య ముసి ముసి నవ్వులతో మురిసిపోవాల్సిన వధూవరులకు కూడా ఇది తప్పదు. అందుకే తమిళనాడుకు చెందిన ఒక పూల వ్యాపారి చాలా  స్మార్ట్‌గా ఆలోచించి చక్కటి మాస్క్‌లను రూపొందించారు. ఈ ఫోటోలు ఇపుడు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఇదేదో బాగుందే.. అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా స్మార్ట్‌గా ఆలోచించడం కొంతమందికే సాధ్యం. తమిళనాడులోని పూల వ్యాపారి ఈ విషయాన్ని నిరూపించారు. రకరకాల పూలతో  చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్‌లను తయారు చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో పట్టుచీరకు మ్యాచింగ్‌గా వధువు పట్టు, వెండి, బంగారం, వజ్రాల మాస్క్‌లను  ధరించడం చూశాం. కానీ  ఖరీదైనవి. అందుకే మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్ తన ఆలోచనకు పదుపెట్టారు.  ముఖ్యంగా వధూవరులకోసం ప్రత్యేకంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మూడు పొరలతో మల్లె , లిల్లీ, గులాబీ  పూలతో ఫేస్ మాస్క్ తయారు చేశారు. 

వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ వెల్లడించారు. ఫ్లవర్ మాస్క్ ఆర్డర్లు ఇప్పుడు చాలా వస్తున్నాయని దీంతో ఒకవైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు పూల మాస్క్‌ ధరించిన వధువును చూడటానికి అందంగా ఉంటుందనీ, ఫోటోలు కూడా కరోనా కాలానికి సంబంధించిన అందమైన జ్ఞాపకంగా  ఉంటాయంటున్నారు. 

మరిన్ని వార్తలు