బడ్జెట్‌ హల్వా బడ్జెట్‌ కూర్పు ప్రారంభం

24 Jan, 2021 04:48 IST|Sakshi

వేడుకలో ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ కూర్పు కార్యక్రమం సంప్రదాయ హల్వా వేడుకతో శనివారం ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు. హల్వా వేడుకలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బడ్జెట్‌ పత్రాల కూర్పులో పాల్గొంటారు. గతంలో ఈ వేడుకలో పాల్గొన్న వారంతా ఆర్థిక శాఖ కార్యాలయం బేస్‌మెంట్‌లోకి వెళ్లి, బడ్జెట్‌ముద్రణలో పాలుపంచుకునేవారు. ఈసారి కోవిడ్‌ దృష్ట్యా బడ్జెట్‌ ప్రతుల ముద్రణను రద్దు చేశారు. పార్లమెంట్‌ సభ్యులకు ఈ దఫా డిజిటల్‌ రూపంలో బడ్జెట్‌ వివరాలను అందజేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఇలా చేయడం ఇదే మొదటిసారి. ‘కేంద్ర బడ్జెట్‌ను మొట్టమొదటిసారిగా పేపర్‌లెస్‌ రూపంలో ఇస్తున్నాం. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం’అని ఆర్థిక శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ కఢాయిలో తయారు చేసిన హల్వాను బడ్జెట్‌ తయారీలో పాల్గొనే సిబ్బందికి పంచారు. నిర్మల బడ్జెట్‌ పత్రాలను చూసేందుకు రూపొందించిన మోబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. బడ్జెట్‌æ పోర్టల్‌ నుంచి దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి వివరాలను చూడవచ్చు. 

మరిన్ని వార్తలు