బ్లాక్‌ ఫంగస్‌ మందులపై జీఎస్టీ ఎత్తివేత

13 Jun, 2021 03:22 IST|Sakshi

టీకాలపై యథాతథంగా 5 శాతం జీఎస్టీ

కోవిడ్‌ చికిత్సలో వాడే పలు వస్తువులపై తగ్గింపు

అంబులెన్స్‌ వినియోగంపై జీఎస్టీ 12%కి తగ్గింపు  

సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధితో కష్టాలుపడుతున్న బాధితులకు కేంద్రప్రభుత్వం కాస్త ఉపశమనం కల్గించే కబురుతెచ్చింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే ఔషధాలపై జీఎస్‌టీ(వస్తుసేవల పన్ను)ను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 44వ సమావేశంలో కోవిడ్‌ విధానాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మే 28న ఏర్పాటైన మంత్రుల బృందమొకటి జూన్‌ ఏడున ఇచ్చిన నివేదికపై కౌన్సిల్‌ చర్చించింది. తాజాగా తగ్గిన జీఎస్‌టీ రేట్లు ఈ సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. కోవిడ్‌ వ్యాక్సిన్లపై వసూలుచేస్తున్న పన్నును తగ్గించాలన్న డిమాండ్లను కౌన్సిల్‌ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వ్యాక్సిన్లపై ప్రస్తుతమున్న 5% పన్ను అలాగే కొనసాగనుంది. ప్రభుత్వమే పౌరులందరికీ ఉచితంగా టీకా అందిస్తున్నందున 5% పన్ను అనేది సాధారణ పౌరుడికి ఏమాత్రం భారం కాబోదని నిర్మలా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలను కౌన్సిల్‌ భేటీ తర్వాత నిర్మలా సీతారామన్‌ మీడియాకు వెల్లడించారు

ఆంఫోటెరిసిన్‌–బీపై సున్నా జీఎస్‌టీ
బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్‌–బి ఔషధంతో పాటు, టోసిలిజుమాబ్‌పై జీఎస్టీ పన్ను రేటును ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. గతంలో ఈ రెండు ఔషధాలపై 5% జీఎస్‌టీ ఉండేంది. అంబులెన్స్‌ సేవలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.

కోవిడ్‌ పరికరాలపై ఇక 5 శాతమే
కోవిడ్‌ సంబంధ ఔషధాలు, పరికరాలపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించారు. హెపారిన్, రెమ్‌డెసివిర్‌ వంటి యాంటీ కోగ్యులెంట్ల జీఎస్‌టీ 12 % నుంచి 5 శాతానికి తగ్గింది. పరికరాలు, మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు/ జనరేటర్లు (వ్యక్తిగత దిగుమతులతో సహా), వెంటిలేటర్లు, వెంటిలేటర్‌ మాస్క్‌లు/హెల్మెట్లు, హై ఫ్లో నాసల్‌ కాన్యులా(హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ) పరికరాల జీఎస్‌టీని 12% నుంచి ఐదు శాతానికి తగ్గించారు. కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్స్, డి–డైమర్, ఐఎల్‌–6, ఫెర్రిటిన్, ఎల్‌డీహెచ్‌ వంటి స్పెసిఫైడ్‌ ఇన్‌ఫ్ల్లమేటరీ డయాగ్నోస్టిక్‌ కిట్లపై పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు.  హ్యాండ్‌ శానిటైజర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు, బీఐపీఏపీ మెషీన్, టెస్టింగ్‌ కిట్, టెంపరేచర్‌ చెక్‌ చేసే పరికరాలుసహా 18 వస్తువులపై జీఎస్‌టీ రేట్లను తగ్గించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు