వీడియో: ఘోరం.. మరుగుదొడ్డిలో కబడ్డీ ప్లేయర్స్‌కు భోజనం

20 Sep, 2022 11:07 IST|Sakshi

లక్నో: కబడ్డీ ఆటగాళ్ల కోసం మరుగుదొడ్డిలో ఆహారాన్ని భద్రపర్చడం, గత్యంతరం లేని స్థితిలో అక్కడే వాళ్లు వడ్డించుకోవడం లాంటి ఘోర పరిస్థితులతో ఉన్న వీడియో వైరల్‌ కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అధికారులు సైతం స్పందించారు. 

ఉత్తర ప్రదేశ్‌ షాహారన్‌పూర్‌లో ఈమధ్య అండర్‌-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ జరిగింది. అయితే.. టాయిలెట్ గదుల్లో భద్రపర్చిన ఆహారాన్ని విద్యార్థులు వడ్డించుకున్నట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. సెప్టెంబర్‌ 16వ తేదీన కొందరు అమ్మాయిలే ఈ వీడియోను రిలీజ్‌ చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది. 

టాయ్‌లెట్‌లో ఓ పక్కన ఉన్న పాత్రల నుంచి అన్నం, కూరలతో పాటు అక్కడి నేలపై ఓ పేపర్‌ ముక్కపై నుంచి పూరీలను అమ్మాయిలు వడ్డించుకుంటున్నారు. ఆ భోజనాన్ని తీసుకుని బయట ఆహారం వండిన స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు వెళ్లి వాళ్లు తింటున్నారు. నిమిషం నిడివి ఉన్న వీడియోలో అక్కడి పరిస్థితులు ఘోరంగా కనిపించాయి. 

ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో షాహారన్‌పూర్‌ క్రీడాఅధికారి అనిమేష్‌ సక్సేనా స్పందించారు. స్టేడియం వద్ద నిర్మాణ పనులు సాగుతున్నాయి. పైగా ఆ సమయంలో వర్షం పడింది. అందుకే స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద వంటలు చేయించాం. అయితే ఆహారాన్ని భద్రపరిచింది బట్టలు మార్చుకునే రూంలో అని ఆయన వెల్లడించారు. పాయిఖానాలో ఆహారాన్ని ఉంచిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే.. వీడియో ఆధారంగా ఏర్పాట్లపై మండిపడుతున్నారు చాలామంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. అధికారులపై వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కానిస్టేబుల్‌ సుధా హత్యకేసులో కీలక మలుపు

మరిన్ని వార్తలు