ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ప్రియ మృతిపై విచారణ పూర్తి.. నివేదికలో ఏముందంటే!

19 Nov, 2022 14:48 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి ప్రియ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదిక ఆరోగ్య శాఖకు చేరింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైద్యులు ముందస్తు బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. చెన్నై వ్యాసార్పాడికి చెందిన ప్రియ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. ప్రత్యేక బృందం జరిపిన విచారణలో పెరియార్‌ నగర్‌ ఆస్పత్రి వైద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వెలుగు చూసింది. ఆమెకు సరైన పద్ధతిలో చికిత్స అందించలేదని తేలింది.  వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని విచారణలో స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌కు ప్రత్యేక బృందం సమర్పించింది. 

బెయిల్‌ నిరాకరణ 
ప్రియ మరణానికి కారకులైన వైద్యులు సోమ సుందరం, బలరాం శంకర్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాము గతంలో అనేక విజయవంతమైన శస్త్ర చికిత్సలు నిర్వహించామని, అందరూ క్షేమంగానే ఉన్నట్లు అందులో వివరించారు. ప్రియ శస్త్ర చికిత్స, మరణం దురదృష్టకరమని, తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. విచారణకు సహకారం అందిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. తాము వైద్య కమిటీ విచారణకు హాజరు కావాల్సి ఉందని, అంతలోపు తమను అరెస్టు చేస్తే వెళ్లలేని పరిస్థితి ఉంటుందని వివరించారు. అయితే, వీరికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో ఈ ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు.  

మరిన్ని వార్తలు