Forced Sex In Marriage: భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం..కోర్టు తీర్పు ఏంటంటే!

13 Aug, 2021 17:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: ‘భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడం చట్ట వ్యతిరేకం’. గతంలో భార్యాభర్తల కేసులో కోర్టులు ఇచ్చిన తీర్పు ఇది. మహిళకు ఇష్టం లేకుండా భర్త శృంగారం కోసం బలవంతపెట్టడం తప్పు అంటూ పలు సందర్భాల్లో కోర్టులు తమ తీర్పును వెలువరించాయి. అయితే తాజాగా ముంబై కోర్టు మాత్రం భార్యభర్తల కేసులో ఇందుకు భిన్నంగా తీర్పిచ్చింది. భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్దం కాదని ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అతను మహిళ భర్త అవ్వడం వల్ల ఇది చట్టం ముందు నిలబడదని ముంబై అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి సంజ‌శ్రీ జే ఘ‌ర‌త్ స్ప‌ష్టం చేశారు. 

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు గత ఏడాది నవంబర్‌ 22న వివాహమైంది.పెళ్లైన కొద్ది రోజుల‌కే తన భ‌ర్త‌, అత్తామామలు వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు గురిచేస్తూ, ఆమెపై ఆంక్ష‌లు విధించారు. అంతేగాక వివాహ‌మైన నెల రోజులకు త‌న కోరిక‌కు విరుద్ధంగా భ‌ర్త త‌న‌తో బ‌ల‌వంతంగా శృంగారం చేసిన‌ట్లు మ‌హిళ ఆరోపించింది. జనవరి 2వ తేదీన తమ జంట మహబళేశ్వరం వెళ్లగా.. అక్క‌డ కూడా భర్త తనపై బ‌ల‌వంతంగా సెక్స్ చేసిన‌ట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యున్ని సంప్ర‌దించింది. అయితే  డాక్ట‌ర్ ఆమెను ప‌రీక్షించిన త‌ర్వాత న‌డుము కింది భాగం ప‌క్ష‌వాతానికి గురైన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో త‌న భ‌ర్త బ‌ల‌వంతంగా శృంగారం చేయ‌డంతోనే తనకీ పక్షవాత సమస్య వచ్చిందని భావించిన మహిళా.. భర్తపై ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం వారు ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. చివరికి ఈ కేసు కోర్టుకు చేర‌డంతో.. తాము వరకట్నం కోసం డిమాండ్‌ చేయలేదని, తప్పుగా ఈ కేసులో ఇరికించారని భర్త, అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భర్త కూడా మహిళపై కేసు పెట్టాడని, తాము( మహిళ ఆరోపించిన కుటుంబ సభ్యులు) రత్నగిరిలో నివసిస్తున్నామని, ఆ జంటతో రెండు రోజులు మాత్రమే కలిసున్నామని కోర్టుకు తెలిపారు.

ఇరువర్గాల వాదనలు విన్న జడ్జీ సంజ‌శ్రీ జే ఘ‌ర‌త్  కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులో మహిళ పక్షవాతానికి గురికావడం దుర‌దృష్టకరం. కాని మహిళ పరిస్థితికి భర్తనే కారణం అనడం సరికాదని పేర్కొన్నారు. అదనపు కట్నం డిమాండ్ చేశారని ఆరోపిస్తున్న మహిళా.. వారు ఎంత డిమాండ్ చేశారో చెప్పడం లేదని బాధితురాలిని ప్రశ్నించారు. పెళ్లి తర్వాత భార్యతో భర్త బలవంతంగా సెక్స్ చేస్తే అది చట్ట విరుద్ధం కాదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ అనవసరమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు