కశ్మీర్‌కు భారీగా ఆయుధాలు పంపించండి!

26 Sep, 2020 03:06 IST|Sakshi

పాక్‌ ఐఎస్‌ఐకి చైనా ఆదేశాలు!

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోకి  పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పంపించాలని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్ర చర్యలకు పాల్పడేందుకు భారత వ్యతిరేక శక్తులకు మరింత సాయమందించాలని సూచించిందని నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ ప్ర భుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల, ఈ ప్రాం తంలో భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై చైనా తయారీ మార్కిం గ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. చొరబాట్లకు వీలు లేకుం డా భారత్‌ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఉగ్రవాదులను కానీ, ఆయుధాలను కానీ కశ్మీర్లోకి పంపించడం పాకిస్తాన్‌కు సాద్యం కావడంలేదు. దాంతో, ఎట్టి పరిస్థితుల్లో శీతాకాలం ప్రారంభమయ్యేలోపు సాధ్యమైనంత భారీ స్థాయిలో ఉగ్రవాదులను, ఆయుధాలను కశ్మీర్‌లోయలోకి పంపించాలని ఐఎస్‌ఐ భావిస్తోంది.

నియంత్రణ రేఖ వెంట చొరబాట్లను అడ్డుకునే ఒక సమర్ధవంతమైన ప్రణాళికను భారత భద్రతాదళాలు రూపొందించాయి. గత 10 రోజుల్లో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణె, బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ అస్థానా, సీఆర్‌పీఎఫ్‌ చీఫ్‌ ఏపీ మహేశ్వరి కశ్మీర్లో పర్యటించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ‘చొరబాటుదారుల విషయంలో భారత బలగాలు వ్యవహరించే తీరును ఐఎస్‌ఐ అధ్యయనం చేసింది. సాధారణంగా ఆయుధం లేకుండా, ఎవరైనా చొరబాటుకు ప్రయత్ని స్తే.. భారత బలగాలు కాల్పులు జరపవు. అందువల్ల ఆయుధాలు లేకుండా, చొరబాటుదారులను పంపించడం, ఆ తరువాత డ్రోన్లు, ఇతర మార్గాల ద్వారా ఆయుధాలను పంపించడం.. అనే వ్యూహాన్ని వారు ప్రారంభించారు. దానివల్ల చొరబాటుదారులు నియంత్రణ రేఖ వద్దనే కాల్చివేతకు గురయ్యే పరిస్థితి ఉండదు’ అని పాక్‌ ఆలోచనను పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ‘కశ్మీర్‌ లోయలో భారత వ్యతిరేక రిక్రూట్‌మెంట్లు పెరిగాయి. అయితే, వారికి ఆయుధాలు సమకూర్చడం సమస్యగా మారింది. అందువల్ల డ్రోన్లు, క్వాడ్‌కాప్టర్‌ల ద్వారా ఆయుధాలు పంపించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు