ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్‌

2 Jan, 2022 05:38 IST|Sakshi

న్యూఢిల్లీ: లైసెన్స్‌ రెన్యువల్‌ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్‌జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్‌సీఆర్‌ఏ యాక్ట్‌) చట్టం కింద లైసెన్స్‌ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్‌ రెన్యువల్‌ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ సంస్థల గత లైసెన్స్‌ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్, లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫామ్‌ ఇండియా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్, గోద్రేజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సొసైటీ, జేఎన్‌యూలోని న్యూక్లియర్‌ సైన్స్‌ సెంటర్, లాల్‌ బహదూర్‌ శాస్త్రి మెమోరియల్‌ ఫౌండేషన్, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫిషర్‌మెన్స్‌ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాల లైసెన్స్‌ గడువు ముగిసింది. భారత్‌లోని ఎన్‌జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్‌సీఆర్‌ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది.

మరిన్ని వార్తలు