వయసైపోయింది.. వెరీ డేంజర్‌: సోరస్‌ను ఏకిపారేసిన కేంద్రమంత్రి జైశంకర్‌

18 Feb, 2023 17:08 IST|Sakshi

ఢిల్లీ: మెల్‌బోర్న్‌ హంగేరియన్‌-అమెరికన్‌ బిలియనీర్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ జార్జ్‌ సోరస్‌పై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఫైర్‌ అయ్యారు.  ప్రధాని మోదీపై 92 ఏళ్ల సోరస్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారాయన. నిన్న(శుక్రవారం) మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

సోరస్‌కు వయసైపోయింది. ఆయనవి మూర్ఖమైన అభిప్రాయాలు అని జైశంకర్‌ పేర్కొన్నారు. న్యూయార్క్‌లో కూర్చుని ప్రపంచం మొత్తం ఎలా పని చేయాలో తానే నిర్ణయించాలని సోరస్‌ అనుకుంటున్నారు. ఆయన వయసైపోయిన వ్యక్తి. ధనికుడు. నచ్చిన అంశాలపై తన అభిప్రాయాలను చెప్తుంటాడు. అంతకు మించి ఆయనొక ప్రమాదకరమైన వ్యక్తి అని జైశంకర్‌ అభివర్ణించారు. 

తనకు నచ్చిన వ్యక్తి  ఎన్నికల్లో గెలిస్తే అది మంచిదని సోరస్‌ భావిస్తాడు. అదే ఫలితం మరోలా వస్తే గనుక.. ప్రజాస్వామ్యంలో తప్పులు వెతుకుతాడు అంటూ జైశంకర్‌, సోరస్‌ గురించి వ్యాఖ్యానించారు. వలసవాదం నుంచి వెలుగులోకి వచ్చిన భారత్‌కు.. బయటి నుంచి జోక్యాలతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో బాగా తెలుసని జైశంకర్‌ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మంత్రి క్రిస్‌ బ్రౌన్‌తో చర్చ సందర్భంగా.. జైశంకర్‌ పై వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉంటే.. PM మోదీ ప్రజాస్వామ్యవాది కాదని,  ముస్లింలపై హింసను ప్రేరేపించడం వల్లే ఆయన స్థాయి పెరిగిందంటూ సోరస్‌ చేసిన కామెంట్లు తీవ్ర దుమారమే రేపాయి. హిండెన్‌బర్గ్‌-అదానీ వ్యవహారంపైనా విదేశీ పెట్టుబడిదారులకు, భారత్‌లోని విపక్షాలకు మోదీ సమాధానం చెప్పాల్సిందని సోరస్‌, మ్యూనిచ్‌(జర్మనీ) సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ఇదీ చదవండి: సోరస్‌ గురించి తెలుసా? ఆయనో ఆర్థిక నేరగాడు!

మరిన్ని వార్తలు