ఎవరైనా సీన్‌ క్రియేట్‌ చేస్తే నడుములు విరిగిపోతాయ్‌!: మధ్యప్రదేశ్‌ మంత్రి వార్నింగ్‌

15 Feb, 2023 16:08 IST|Sakshi

బోఫాల్‌: అధికార దర్పం ప్రదర్శించే నేతలను తరచూ చూస్తుంటాం. కానీ, ఆ మదంతో అడ్డగోలు వ్యాఖ్యలు, చర్యలు చేసేవాళ్లూ కూడా అక్కడక్కడ తారసపడుతుంటారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో అటవీ శాఖ మంత్రి విజయ్‌ షా అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఆ సమావేశంలో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మంత్రి విజయ్‌ సహనం కోల్పోయారు. కాంగ్రెస్‌ పార్టీయే అతన్ని సమావేశానికి అంతరాయం కలిగించేలా.. మద్యం తాగించి పంపించిందంటూ ఆ వ్యక్తిపై చిందులు తొక్కారు. ఈ మేరకు స్థానిక కాం‍గ్రెస్‌ నాయకుడిని ఉద్దేశించి.. మేము మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్నాం. ఇక్కడ ఎవరైనా సీన్‌ క్రియేట్‌ చేయడానికి ప్రయత్నిస్తే వారిని అరెస్టు చేస్తాం. ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం  కలిగించి వారి నడుములు పగిలిపోతాయ్‌! అంటూ గట్టిగా హెచ్చరించారు.

వాస్తవానికి ఆ వ్యక్తి తన భార్య అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తోందని, ఆరు నెలలుగా జీతం రావడం లేదంటూ మంత్రి ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ విషయమై మంత్రిగారిని గట్టిగా ప్రశ్నించాడు. అంతే అటవీ శాఖ మంత్రి ఊగిపోతూ.. సదరు వ్యక్తిపై తిట్లదండకం అందుకున్నాడు. 

(చదవండి:  ఆప్‌ మంత్రిని విచారించిన సీబీఐ)

మరిన్ని వార్తలు