మాజీ ముఖ్యమంత్రి అస్తమయం

23 Nov, 2020 18:36 IST|Sakshi

అవయవాల పనితీరు క్షీణించడంతో మృతి

గొగొయ్‌ మరణం పట్ల ప్రముఖుల సంతాపం

గువాహటి: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ (84) మృతి చెందారు. కోవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగొయ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు రాష్ట్రా ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్ మతెలిపారు. గొగోయ్‌ శరీరంలో పలు అవయవాల పనితీరు క్షీణించడంతో వెంటిలేటర్‌ సపోర్టుపై ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో గొగోయ్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి.. ప్లాస్మా థెరిపీ చికిత్స చేశారు. కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజుల తర్వాత ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నవంబర్‌ 2 నుంచి ఆయన గువాహటి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ సపోర్టు మీదనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడటమే కాక, శరీరంలో కీలక అవయవ వ్యవస్థలు వైఫల్యం చెందడంతో మృతి చెందారని వైద్యులు తెలిపారు.

తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో దిబ్రుగఢ్‌ నుంచి గువాహటికి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. (చదవండి: ఇది మోదీ చేసిన మూడో తప్పు : గగోయ్‌)

కోవిడ్‌ బారిన పడటానికంటే ముందువరకు కూడా తరుణ్‌ గొగొయ్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.  2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ‘గ్రాండ్ అలయన్స్’ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావించింది. దీన్ని ముందుకు తీసుకుపోవడంలో గోగోయ్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడంతో గొగోయ్ 2001లో అస్సాం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. తరుణ్‌ గొగొయ్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా