పదేళ్ల క్రితం చేతిలో రూ.6,300.. ఇప్పుడేమో కోట్లు.. పార్థ చటర్జీ అఫిడవిట్‌లో కీలక విషయాలు

29 Jul, 2022 18:22 IST|Sakshi

కోల్‌కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్‍మెంట్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు మొత్తం రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని కోట్లున్న మాజీ మంత్రి వద్ద పదేళ్ల క్రితం కేవలం రూ.6,300 ఉన్నాయంటే నమ్మగలరా?

2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థ చటర్జీ సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన వద్ద రూ.6,300 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మొత్తం 23 రెట్లు పెరిగింది. ఈసారి అఫిడవిట్‌లో తన వద్ద రూ.1,48,676 నగదు ఉన్నట్లు ఆయన తెలిపారు.

కానీ ఇప్పుడు అవినీతి కేసులో మంత్రి సన్నిహితుల ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం రాజకీయంగా కలకలం రేపింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీలోని అని పదవుల నుంచి తప్పించింది. ఇంకా పార్థ చటర్జీ, ఆయన సన్నిహితులకు సంబంధించిన నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన మాత్రం తనపై కుట్ర చేస్తున్నారని అంటున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందనడం గమానార్హం.
చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి

మరిన్ని వార్తలు