కరోనాతో ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి

3 Apr, 2021 14:52 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శనివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా చేరినట్లు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 

మార్చి 30వ తేదీన 83 ఏళ్ల ఫరూక్‌ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. ఈ మేరకు ఫరూక్‌ శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన కరోనా వ్యాక్సిన్‌ పొందిన తర్వాత పాజిటివ్‌ రావడం గమనార్హం. ‘తన తండ్రి కోసం ప్రతిఒక్కరూ చేస్తున్న ప్రార్థనలు, మద్దతు తెలుపుతున్నందుకు మా కుటుంబం గర్వపడుతుంది’ అని పేర్కొన్నారు. ఫరూక్‌ అబ్దుల్లా ఆరోగ్యం విషయమై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఆయన వెంటనే కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. 
 

>
మరిన్ని వార్తలు