మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్న కేజ్రీవాల్‌.. కాంగ్రెస్‌కు షాక్‌

14 Apr, 2022 18:37 IST|Sakshi

గాంధీనగర్‌: ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో సీఎం భగవంత్‌ మాన్‌ నేతృత్వంలో ఆమ్‌ సర్కార్‌ పాలన సాగిస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలో జరగబోయే గుజరాత్‌ ఎన్నికలపై ఆప్‌ దృష్టి సారించింది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ ఇప్పటికే అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని గుజరాతీలకు కోరారు.

ఇదిలా ఉండగా.. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్‌ షాక్‌ త‌గిలింది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు గురువారం ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. కేజ్రీవాల్‌ను కలిసి అనంతరం ఆయన ఆప్‌లో చేరారు. ఈ సందర్భంగా ఇంద్రనీల్‌ మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అరవింద్‌ కేజ్రీవాల్‌ అని ప్రశంసించారు. దేశ ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అలాగే, బీజేపీకి పోటీగా ఎదగడంతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.  గుజ‌రాత్‌లో బీజేపీని ఓడించేందుకు, ప్రజ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు ఆప్ సరైన పార్టీ అని అన్నారు. అందుకే తాను ఆప్‌లో చేరినట్టు స్పష్టం చేశారు.

కాగా, 2012లో రాజ్‌కోట్ ఈస్ట్ నుంచి ఇంద్రనీల్‌ రాజ్‌గురు.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో రాజ్‌కోట్ వెస్ట్‌ నుంచి సీఎం విజ‌య్ రూపానీపై పోటీ చేసి ఆయన ఓటమిని చవిచూశారు. ఇక, సీనియర్‌ నేత ఇంద్రనీల్‌.. ఆప్‌లో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు