‘సెక్రెటరీ నా దగ్గరకు వచ్చి రెండు సంతకాలు చేస్తే 300 కోట్లు వస్తాయన్నాడు’

22 Oct, 2021 19:19 IST|Sakshi

న్యూఢిల్లీ: తన జీవితంలో అవినీతితో ఎప్పుడూ రాజీ పడలేదని అటువంటి పరిస్థితే వస్తే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధపడినట్లు మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తెలిపారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. కాగా సత్యపాల్‌ మాలిక్ ఆగష్టు 21, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సంవత్సరం తరువాత అక్టోబర్ 2019లో గోవాకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మేఘాలయకు గవర్నర్‌గా పని చేస్తున్నారు.

ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను జమ్మూ కాశ్మీర్‌కు పోస్ట్ అయిన వెంటనే, తన టేబుల్‌పై రెండు ఫైళ్లు వచ్చాయని తెలిపారు. అవి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థలవి. కాకపోతే అందులో ఏదో స్కామ్ ఉందని తనకు తెలిసిందని, అందుకు ఆ రెండు ఒప్పందాలను రద్దు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ ఫైల్‌లను క్లియర్ చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన సెక్రటరీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

దీని వల్ల ఒత్తిళ్లు వస్తాయని కూడా కొందరు తెలపడంతో ఆ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ విషయాన్నే అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలియజేయగా, తన నిర్ణయాన్ని ప్రధాని సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు